మోడీకి ఆర్ఎస్ఎస్ షాక్‌… నోట్ల ర‌ద్దు చావుల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌న్న సంఘ్‌

untitled-3-copy

ఆర్ఎస్ఎస్ చెబుతుంది…. మోడీ ఆచ‌రిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో ఇదే అభిప్రాయం ఉంది. అయితే, ఇప్పుడు మోడీ సంఘ్‌ను కూడా దాటిపోయారు. తాను చేయ‌ద‌ల‌చుకున్న‌ది చేసేసుకుంటూ పోతున్నారు. అదేమ‌ని అడిగే సాహ‌సం పార్టీలో ఎవ‌రికీ లేక‌పోవ‌డంతో మోడీ హ‌వా అప్ర‌తిహాతంగా సాగిపోతుంది. ఆ క్ర‌మంలోనే దేశంలో న‌ల్ల ధ‌నాన్ని నియంత్రించ‌డానికంటూ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి పారేశారు. ఆ నిర్ణయంతో దేశ‌మంతా ఇప్పుడు బ్యాంకుల ఎదుట క్యూల‌లో నిలుచుంది. దీనిపై అన్ని ప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మోడీ మాత్రం వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా మోడీని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. సంఘ్ ప్రముఖనేత కేఎన్.గోవిందాచార్య మోడీ చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతూ ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ఒక లేఖ రాశారు. కేంద్ర ఆర్థికవ్యవహారాల శాఖా కార్యదర్శి శక్తికాంత్ దాస్‌కి రాసిన లేఖలో ఆయన ప్రభుత్వాన్ని తూర్పార‌బ‌ట్టారు. దేశవ్యాప్తంగా చనిపోయిన 40మంది చావుకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలా చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు మూడు రోజుల్లో నష్టపరిహారాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించాలని అలా చెల్లించ‌కుంటే..

త‌గిన ప్ర‌తిఫ‌లం అనుభ‌విస్తార‌ని నేరుగా మోడీనే హెచ్చ‌రించారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మోడీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని గోవిందాచార్య మండిప‌డ్డారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ‘జీవించేహక్కు’కు ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన దుయ్యబట్టారు. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని గోవిందాచార్య స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే విప‌క్షాల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న మోడీకి ఇప్పుడు సంఘ్ లేఖ మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది.

Loading...

Leave a Reply

*