ఆ ఖాకీకి క‌న్న‌వారే బ‌రువ‌య్యారు!

police

చేసేది ప్ర‌జా ర‌క్ష‌క‌భ‌టుని ఉద్యోగం. కానీ అత‌డు క‌న్న‌వారినే కాపు కాయ‌లేడు. త‌ల‌పై దేశ ప్ర‌తిష్ట‌ను మోసే మూడు సింహాలుంటాయి. కానీ అత‌డికి త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులే బ‌రువ‌య్యారు. నెత్తిన టోపీ… చేతిలో లాఠీ… స‌మాజంలో ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌గ‌ల ఉద్యోగం. కానీ అత‌డి మ‌న‌సు మాత్రం మ‌ర‌గుజ్జే. ఇది ఓ పోలీసు క‌థ‌. కాదు కాదు ఆయ‌న త‌ల్లిదండ్రుల వ్య‌థ‌. అత‌డి పేరు లింగ‌య్య‌. ఖ‌మ్మం అర్బ‌న్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌. పెంచి పెద్ద చేసి… ప్ర‌యోజ‌కుడిని చేస్తే… ఇప్పుడు కొలువు సంపాదించిన త‌ర్వాత క‌న్న‌వారే బ‌రువ‌య్యార‌త‌డికి. క‌న్న‌కొడుకు త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ క‌న్న‌వారు ఇప్పుడు రోడ్డెక్కారు.

త‌మ కుమారుడికి మంచి బుద్ధి ప్ర‌సాదించి త‌మ ప‌ట్ల ఆద‌ర‌ణ చూపేలా ఎవ‌రైనా ప‌ట్టించుకోవాలంటూ కుమారుడి చిత్రంతో కూడిన బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ రోడ్డు ప‌క్క‌న నిర‌స‌న‌కు దిగారా త‌ల్లిదండ్రులు. వారి పేరు కొండా మ‌ల్ల‌య్య‌, పూల‌మ్మ‌. వీరిది వ‌రంగ‌ల్ జిల్లా దారుబావుల గ్రామం. త‌న‌ ముగ్గురు కుమారుల‌కు మ‌ల్ల‌య్య త‌మ‌కున్న పొలాన్ని స‌మానంగా పంచిపెట్టారు. అలాగే త‌మ జీవనం కోసం ముగ్గురు కొడుకులు లక్ష‌న్న‌ర రూపాయ‌ల చొప్పున ఇవ్వాల‌ని కోరాడు. ఈ మేర‌కు ఇద్ద‌రు కుమారులు ల‌క్ష‌న్న‌ర వంతున తండ్రికి ఇవ్వ‌డంతో వాటిని దాచుకుని వారిద్ద‌రూ కాలం గ‌డుపుతున్నారు.

అయితే, మ‌ల్ల‌య్య పెద్ద కుమారుడు, కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న లింగ‌య్య మాత్రం తండ్రి పోలం తీసుకున్నందుకు తన వాటాగా ఇవ్వాల్సిన ల‌క్ష‌న్న‌ర ఇవ్వ‌క‌పోగా… త‌న త‌మ్ముళ్లు త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చిన మూడు ల‌క్ష‌లు ప‌ట్టుకెళ్లిపోయాడని మ‌ల్ల‌య్య రోదిస్తూ చెప్పారు. దీంతో చేసేదేమీ లేక కొడుకు ఫొటోతో కూడిన బ్యాన‌ర్‌ను క‌ట్టుకుని త‌ల్ల‌దండ్రులిద్ద‌రూ రోడ్డుప‌క్క‌న భైఠాయించారు. దీంతో స్పందించిన స్థానిక సీఐ… ఆ త‌ల్ల‌దండ్రుల‌ను, కానిస్టుబుల్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Loading...

Leave a Reply

*