గోదావ‌రి నుంచి బాబుకు ప‌వ‌న్ ఎర్త్!

pawan-kalyan

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు గోదావ‌రి క‌ష్టాలు మొద‌లైన‌ట్లే. ఏపీలో ఉన్న విప‌క్ష రాజ‌కీయ శూన్య‌త‌ను పూడ్చేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. అప్పుడో స‌భ‌.. ఇప్పుడో స‌భ అంటూ కాలం గ‌డిపేస్తున్ ప‌వ‌న్ ఇక‌పై సీరియ‌స్‌గా రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప‌వ‌న్ చేస్తున్న మొద‌టి ప‌ని త‌న ఓటు హ‌క్కును ఏపీకి మార్పించుకోవ‌డం. అది కూడా త‌న జ‌న్మ‌స్థ‌ల‌మైన గోదావ‌రి జిల్లాకు మార్పించుకోవ‌డం. ప‌వ‌న్ ఆషామాషిగానో, అభిమానుల కోరిక మీద‌నో ఈ నిర్ణ‌యం తీసుకోలేదు. పూర్తి రాజ‌కీయ ప‌రిజ్ఞ‌నంతో వ్యూహాత్మ‌కంగానే ప‌వ‌న్ త‌న చూపును గోదావ‌రి జిల్లాల‌పై పెట్టారు. రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. తూర్పు ఎటు ఉంటే మార్పు అటేన‌ని.

అంటే గోదావరి జిల్లాల ప్ర‌జ‌లు ఎటువైపు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం. ఇది చాన్నాళ్లుగా ఆచ‌ర‌ణ‌లో కూడా నిజ‌మ‌వుతోంది. అందుకే ఈ ప్రాంతంలో ప‌ట్టు కోల్పోవ‌ద్ద‌నే చంద్ర‌బాబు… ఇక్క‌డి మెజార్టీ సామాజిక‌వ‌ర్గ‌మైన కాపుల‌ను మ‌చ్చిక చేసుకునే చ‌ర్య‌లు చేప‌ట్టారు. వారిని బీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నారు. అలాగే, కాపు రుణ మేళాలు, ఉద్యోగ మేళాలు భారీగా నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ వ్య‌క్తిత్వ ప‌రంగా సామాజిక వ‌ర్గాల వారీగా జ‌నాన్ని వేరు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే, త‌న సొంత ప్రాంతం ఇదే కావ‌డంతో ఆయ‌న త‌న చిరునామాను ఇక్క‌డ‌కు మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుని ఉంటారు.

ప‌వ‌న్ ఇక్క‌డ‌కు మారితే ఇక గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన‌కు పూర్తి ప‌ట్టు దొరిక‌న‌ట్లే. ప‌వ‌న్‌కు ఓట‌ర్ల‌ను సామాజిక వ‌ర్గాల వారీగా చూడ‌డం ఇష్టం లేకున్నా… ఇక్క‌డి జ‌నం మాత్రం ప‌వ‌న్‌ను త‌మ వాడిగానే భావిస్తారు. అది అంతిమంగా ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా అత్య‌ధిక ల‌బ్ధి చేకూర్చే అవ‌కాశం ఉంది. గోదావ‌రి జిల్లాలు జ‌న‌సేన‌వైపు తిరిగితే రాష్ట్రంలో రాజ‌కీయం రంజుగా మారిన‌ట్లే. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో ప్ర‌తి విష‌యంలో విప‌క్షం వైఫ‌ల్యం చెందుతుండ‌డంతో అధికార‌ప‌క్షం త‌న ప‌ని తాను నిరాటంకంగా చేసుకుపోతుంది. ఇక‌పై ఆ ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

Loading...

Leave a Reply

*