మోడీని ముంచేందుకే కేసీఆర్ ఈ ప్లాన్ ఇచ్చారా?

untitled-7

పెద్ద నోట్ల ర‌ద్దుపై ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాత దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు చాల‌మంది కాళ్ల కింద భూమి క‌దిలిపోయింది. యూపీ, పంజాబ్‌, గోవా త‌దిత‌ర రాష్ట్రాల్లోని నేత‌ల‌కైతే ఆ రోజు రాత్రి నిద్ర ప‌ట్ట‌లేదు. వ‌చ్చే ఏడాది నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నుండ‌డ‌మే కార‌ణం. ఇక‌, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే, మోడీపై త‌మ ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. ఆ జాబితాలో తొలి రెండు రోజులు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో చాలా న‌ష్ట‌పోతున్నామ‌ని కేసీఆర్ సాక్షాత్తూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహన్‌ను క‌లిసి మొర‌పెట్టుకున్నారు. ఒక ద‌శ‌లోజాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రుల‌ను కూడ‌గ‌ట్టే ప‌ని మోడీ చేప‌ట్టార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఏమైందో ఏమో కానీ మూడో రోజుకు యూట‌ర్న్ తీసుకున్నారు.

ఇప్పుడు మోడీ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూనే.. రాష్ట్రానికి జ‌రుగుతున్న న‌ష్టంపై కేంద్రానికి నివేదించాల‌ని నిర్ణ‌యించారు. అలాగే, ప‌నిలో ప‌నిగా నోట్ల ర‌ద్దు, న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు తేవ‌డంపై ఎలా వ్య‌వ‌హ‌రిస్తే బావుండేదో ఓ స‌ల‌హా ప‌డేశారు. ముఖ్య‌మంత్రులంద‌రినీ పిలిచి ఓ స‌మావేశం పెట్టి త‌న మ‌న‌సులోని మాట‌ను మోడీ ప్ర‌క‌టించి దానిపై వారి అభిప్రాయ‌ల‌ను తెలుసుకుని తాను చేయ‌ద‌ల‌చుకున్న‌ది చేస్తే బావుండేద‌ట‌. ఇప్ప‌టికే చాలామందికి మోడీ ముందే స‌మాచారం లీక్ చేశార‌న్న దానిపై ఆగ్ర‌హాలు వ్య‌క్తం అవుతుంటే… కేసీఆర్ ఏమో ముఖ్య‌మంత్రులంద‌రికీ చెప్పిచేయాలంటున్నారు. ఇప్పుడంటే కొద్దోగొప్పో మోడీకి మంచి పేర‌న్న వ‌చ్చింది. కేసీఆర్ చెప్పిన‌ట్లు చేసి ఉంటే మోడీ నిండా మున‌గాల్సి వ‌చ్చేది. ముఖ్య‌మంత్రులంద‌రికీ చెప్పిన త‌ర్వాత విష‌యం బ‌య‌ట‌కు లీకైన త‌ర్వాత న‌ల్ల బాబులు ముందే జాగ్ర‌త్త ప‌డ‌తార‌న్న లాజిక్ కేసీఆర్ ఎందుకు మిస్స‌య్యారో. లేకుంటే కేసీఆర్ మ‌దిలో ఇంకేదైనా రెండో ఆలోచ‌న ఉందా అని బీజేపీ నేత‌లు అనుమానిస్తున్నారు.

Loading...

Leave a Reply

*