చంద్ర‌బాబు చెబితే ఓకే!

chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెద్ద‌మ‌నిషి అయిపోయారు. ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌హా… పొరుగునున్న‌ తెలంగాణ సీఎం కేసీఆర్ స‌హా ఆయ‌న బృంద‌మంతా చంద్ర‌బాబును ఓ పెద్ద‌మ‌నిషిలా భావించి గౌర‌వించాయ‌ట‌. ఇంటిపెద్ద చెబుతుంటే అంద‌రూ కామ్‌గా విన్న‌ట్లు…. బాబుగారు చెబుతుంటే అపెక్స్ స‌మావేశానికి వ‌చ్చిన‌వారంతా సైలెంట్‌గా వింటూ త‌లూపార‌ట‌. పైగా మీరు పెద్ద‌వాళ్లు.. మీరు చెబితే కాద‌నేదేముందీ అన్న‌ట్లు అక్క‌డి వారంతా వ్య‌వ‌హ‌రించార‌ట‌. ఇదంతా ఎవ‌రో చెప్పిన క‌థ‌నం కాదు. స్వ‌యంగా చంద్ర‌బాబే చంద్ర‌బాబు గురించి చెప్పుకున్న మాట‌లు. చేసుకున్న వ్యాఖ్య‌లు.

తెలంగాణ‌లో జ‌ల వివాదాల‌పై ఢిల్లీలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీ బేటీలో జరిగిన ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గ స‌హచ‌రుల‌తో పంచుకున్నారు. ఢిల్లీ సమావేశంలో అందరూ నాకు గౌరవం ఇచ్చి.. నేను చెప్పింది విన్నారు. నేను బాగా సీనియర్‌ను కావడం సహజంగానే ఆ గౌరవం తెచ్చింది. నేను కూడా ఆ గౌరవం నిలుపుకునేలాగే చెప్పాను. కేంద్రంలో మిగిలిన మంత్రులు కూడా నా పట్ల, మన రాష్ట్రం పట్ల మంచి ఆదరాభిమానాలు చూపిస్తున్నారు అని చంద్ర‌బాబు త‌న మంత్రుల‌కు చెప్పారు.

ఒక ద‌శ‌లో కేసీఆర్ స‌మావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మైతే తానే స‌ముదాయించి కూర్చోబెట్టి సామ‌రస్య‌పూరిత వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు సాగేలా చూశాన‌ని చంద్ర‌బాబు చెప్పుకున్నారు. అయితే, ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబుపై హ‌రీశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని, కేసీఆర్ జోక్యం చేస‌కుని హ‌రీశ్‌ని అదుపు చేశార‌ని, అలాగే, ఏపీ అడ్డుకుంటున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కేసీఆర్ ఇచ్చిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌తో బాబు స‌హా కేంద్ర మంత్రి ఉమాభార‌తి మారుమాట్లాడ‌లేక‌పోయార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు త‌న గొప్ప‌త‌నాన్ని తానే చెప్పుకోవ‌డం మొద‌లు పెట్టార‌ని ఏపీలోని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*