కేసీఆర్ కంటే వెన‌క‌ప‌డ్డ బాబు?

kcr-and-babu

తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు చంద్రుల పాల‌న కొన‌సాగుతోంది. ఏపీలో చంద్ర‌బాబు, తెలంగాణ‌లో చంద్ర‌శేఖ‌ర‌రావు ఇద్ద‌రూ ఒకే స్కూలు విద్యార్థులు. అస‌లు కేసీఆర్‌కు చంద్ర‌బాబే రాజ‌కీయాల్లో లిఫ్ట్ ఇచ్చార‌ని బాబు వ‌ర్గీయులు చెబుతుంటారు. అయితే, చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నందునే కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మం చేప‌ట్ట‌డం… దాంతో రాష్ట్ర విభ‌జ‌న అనివార్యం కావ‌డం జ‌రిగాయ‌నుకోండి. అది వేరే సంగ‌తి. ఇద్ద‌రు చంద్రులు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక‌రితో పోటీ ప‌డి మ‌రొక‌రు నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి గ‌త రెండున్న‌రేళ్ల నుంచి చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల‌కు ఫిట్‌మెంట్‌లో అయినా.. ఉద్యోగుల జీత‌భ‌త్యాల పెంపులో అయినా…. విప‌త్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవ‌డంలో అయిన ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించే ప్ర‌య‌త్నాలే చేశారు.

తాజాగా ఒలింపిక్ విజేత సింధూకు న‌జ‌రానా విష‌యంలో కూడా చంద్ర‌బాబు మూడు కోట్లిస్తే… కేసీఆర్ ఐదు కోట్లిచ్చి తానే పైన అని చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా కేసీఆర్ ఓ అడుగు ముందున్నారు. ప‌ది జిల్లాల‌తో ఏర్ప‌డిన చిన్న రాష్ట్రం తెలంగాణ‌లో ఇప్పుడు కొత్త‌గా 21 జిల్లాలు చేర్చి మొత్తం 31 జిల్లాల‌తో సంఖ్యాప‌రంగా దేశంలోని పెద్ద రాష్ట్రాల‌లో ఒక‌టిగా చేర్చే ప‌నిని దిగ్విజ‌యంగా ముగిస్తున్నారు. అయితే, ఏపీలో చంద్ర‌బాబు మాత్రం ఉన్న 13 జిల్లాలే చాల్లే అన్న‌ట్లు వాటి స‌రిహ‌ద్దుల‌ను మార్చి కొత్త జిల్లాల ఏర్పాటు విష‌య‌మే ప‌ట్టించుకోలేదు. కానీ, నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై మాత్రం కేంద్రంతో ఎడ‌తెగ‌ని మంత‌నాలు జ‌రుపుతున్నారు. అంటే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగేది నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో కాబ‌ట్టి…

అవి పెర‌గ‌కుండా జిల్లాలు పెంచినా ఉప‌యోగం లేద‌ని చంద్ర‌బాబు భావిస్తుండ‌వ‌చ్చు. అయితే, కేసీఆర్ మాత్రం జిల్లాల పెంపును ఆయుధంగా చేసుకుని విప‌క్ష నేత‌ల సుర‌క్షిత నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఛిన్నాభిన్నం చేసి రాజ‌కీయంగా వారిని దెబ్బ‌కొడుతున్నారు. దాంతో ఇక్క‌డి విప‌క్ష పార్టీలు కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటును చూసి విల‌విల్లాడిపోతున్నారు.

Loading...

Leave a Reply

*