జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోకి డ‌బ్బులేస్తున్నారు

modi

జ‌న్ ద‌న్ ఖాతాల్లోకి డ‌బ్బు జ‌మ అవుతోంది. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డి మోడీయే త‌న హామీని అమ‌లు చేస్తున్నాడ‌ని అనుకుంటున్నారా? అలా పొర‌బ‌డ‌కండి. ఇలా డ‌బ్బు ప‌డ‌డానికి మోడీయే కార‌ణం. ఆయ‌న తీసుకున్న న‌ల్ల‌ధ‌నం నిర్మూల‌న కార్య‌క్ర‌మ ఫ‌లిత‌మే ఇప్పుడు జ‌న్‌ద‌న్ ఖాతాల్లోకి డ‌బ్బులు వ‌చ్చి ప‌డుతున్నాయి. పెద్ద నోట్ల నిషేధంతో క‌కావిక‌లం అవుతున్న చాలామంది త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకునేందుకు ఇప్పుడు జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను వాడుకుంటున్నారు. జీరో అకౌంట్‌ల‌తో ఖాళీగా ఉన్న ఈ ఖాతాల‌ను కొంద‌రు టోకుగా సొంతం చేసుకుంటున్నారు. పాన్ కార్డు అవ‌స‌రం లేకుండా 49 వేల రూపాయ‌లు జ‌మ‌చేసే వీలుండ‌డంతో ఈ ప‌ద్ధ‌తిలోనే జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డ‌బ్బు వేయ‌డానికి చాలామంది ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇలా 49 వేల‌ను వారి ఖాతాలో వేసి నందుకు రూ.500 నుంచి వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కూ క‌మిష‌న్ కూడా ఇస్తున్నారు. దాంతో దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో జ‌న్‌ధ‌న్ ఖాతాల‌న్నీ ఇప్పుడు వేలు, ల‌క్ష‌ల రూపాయ‌ల బాలెన్స్‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. తమ బ్రాంచిలో 15వేల జనధన ఖాతాలు ఉన్నాయని, వాటిలోని 30 శాతం ఖాతాల్లో ఒక్కసారిగా గురువారం నుంచి 49వేల రూపాయల చొప్పున డిపాజిట్లు వచ్చి పడ్డాయని ఆగ్రాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అజయ్ అగ్నిహోత్రి తెలిపారు. ఇది ఒక్క ఆగ్రాకే ప‌రిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు స‌హా చాలా ప్రాంతాల‌లో ఇలాగే జ‌రుగుతోంది. మ‌రికొంత‌మంది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇత‌రుల ఖాతాల్లో జ‌మ చేసి వారి వ‌ద్ద నుంచి చెక్‌ల‌ను ష్యూరిటీ పొందుతున్న ఉదంతాలు ఉన్నాయి.

Loading...

Leave a Reply

*