టీడీపీ నేత‌ల హోదా సంపాద‌న ఇదుగో!

ap-tdp-leaders

ఏపీకి హోదా కంటే ప్యాకేజీ బెట‌రంటున్న టీడీపీ నేత‌లు తాము మాత్రం హోదాతో వ‌చ్చే ల‌బ్ధితో కొట్లు సంపాదిస్తున్నారు. కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌, ఎంపీలు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, జేసీ దివాక‌ర్ రెడ్డి, గ‌ల్లా జ‌య‌దేవ్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు ఇలా అంద‌రూ ప్ర‌త్యేక హోదా ల‌బ్ధి పొందుతున్న వారే. ఎలాగంటారా? అయితే చ‌ద‌వండి. హోదాతో ఏం వ‌స్తుందో చెప్పండి అన్న చంద్ర‌బాబు ప్ర‌శ్న‌కు ఇదుగో ఈ టీడీపీ మంత్రులు, ఎంపీల సంపాద‌నే స‌మాధానం. ఏపీకి హోదా అక్క‌ర్లేదంటున్న ఈ నేత‌లంతా ప్ర‌త్యేక హోదా ఉన్న ఉత్త‌రాఖండ్‌లో వ్యాపారాలు పెట్టి ప‌న్ను రాయితీలు పొందుతున్నారు. వీరు చేస్తున్న వ్యాపార‌ల ప‌ట్ల ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. అయితే, హోదాతో ఏం ఓరిగేది లేదంటున్న చంద్ర‌బాబుకు ఇదుగో మేం ఒర‌గ‌బెట్టుకుంటున్నాం అని చెప్ప‌క‌పోవ‌డ‌మే అప‌రాధం. పైగా తామే స్వ‌యంగా ఏపీకి హోదా అక్క‌ర్లేదు ప్యాకేజీ చాలంటూ సుజానా వంటివారే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం మ‌హాప‌రాధం.

ఉత్త‌రాఖండ్‌కు హోదా క‌ల్పించిన త‌ర్వాత అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టిన ఏపీ నేత‌ల‌లో కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రే టాప్‌లో ఉన్నారు. సుజనా ఉత్తరాఖండ్ లో సొంతంగా ఫ్యాన్లకు త‌యారీ యూనిట్ నెలకొల్పారు. ఆ సంస్థకు ఛైర్మన్ హోదాలో 2006లో వార్షిక నివేదిక విడుదల చేసిన ఆయన… అందులో.. ఉత్తరాఖండ్లో తయారీ పరిశ్రమ అభివృద్ధికి మంచి సౌకర్యాలు ప్రోత్సాహకాలున్నాయని పేర్కొన్నారు. ఎక్సయిజ్ డ్యూటీ మినహాయింపు సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ (సిఎస్టి) తగ్గింపు ఆదాయపన్ను రాయితీలు ఉన్నాయని పరిశ్రమల విస్తరణ ఉత్పత్తికి అవకాశం కలుగుతుందని ప్రస్తావించారు. ఇదంతా సుజానా కంపెనీల‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లోనే ఉంది. ఇక‌, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా ఉత్తరాఖండ్ లో నార్త్ ఈస్ట్రన్ పవర్ ప్రాజెక్ట్స్ (పి)లో రూ.69 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు స్వ‌యంగా ఎన్నికల అఫిడవిట్లో ప్ర‌క‌టించారు.

టిడిపికే చెందిన ఎంపీ గ‌ల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా కంపెనీ బ్యాటరీల ఉత్ప‌త్తి క‌ర్మాగారాన్ని ఉత్తరాంచల్లో నెలకొల్పేందుకు భూములు కొన్నది. ఈ విష‌యాన్ని స‌ద‌రు సంస్థ 2009-10 వార్షిక నివేదికలో పేర్కొంది. గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్లో శివశక్తి బయోప్లాంటెక్ కంపెనీని న‌డుపుతున్నారు. బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత కావూరి సాంబ‌శివ‌రావు కూడా ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టి సంపాదించుకుంటున్నారు. అయితే, వీరంతా మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా అక్క‌ర్లేద‌ని ప్యాకేజీ చాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. స‌రే వీరు చెబుతున్న‌ట్లే జ‌నం ప్యాకేజీకి ఒప్పుకుంటే వీరి కంపెనీల‌ను హోదా రాష్ట్రాల నుంచి ఏపీకి త‌ర‌లిస్తారా అన్న‌ది వారే చెప్పాలి.

Loading...

Leave a Reply

*