తెలంగాణ‌లో టీడీపీ హ్యాపీ… టీఆర్ఎస్‌కి షాక్‌!

chandra-kacr

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి ఈ బుధ‌వారం హ్యాపీ బుధ‌వారం అయ్యింది. అదే స‌మ‌యంలో అధికార పార్టీకి భారీ షాక్ త‌గిలింది. టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో టీడీపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవ‌డంతో మొద‌లైన క‌ష్టాలు కేసీఆర్ అమ‌లు చేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో తీవ్ర‌మ‌య్యాయి. పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేర‌డంతో ముగ్గురు మాత్ర‌మే టీడీపీలో మిగిలారు.

దీంతో టీడీపీపై కోలుకోలేని దెబ్బ‌ప‌డింది. స‌మైక్య‌వాదులుగా, తెలుగుదేశం పార్టీని గుండెల్లో నింపుకున్న వాళ్లు సైతం కేసీఆర్ దెబ్బ‌కు గులాబీ కండువా క‌ప్పుకోవ‌డంతో రాష్ట్రంలో టీడీపీ దాదాపు సున్నా అయిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ పార్టీకి కొత్త ఊపిరులూదింది. టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు ఇచ్చిన విలీనం లేఖ చెల్ల‌ద‌ని హైకోర్టు తేల్చేయ‌డంతో టీడీపీ నేత‌ల సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోయింది. హైకోర్టు తీర్పును చూస్తే… పార్టీ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ఖాయ‌మ‌ని టీడీపీ భావిస్తోంది.

మూడు నెల‌ల్లో వారి అన‌ర్హ‌త‌పై ఏదోక నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్పీక‌ర్‌కు కోర్టు సూచించ‌డంతో టీడీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ నేత‌లు దిగ్ర్భాంతికి గుర‌య్యారు. పార్టీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేన అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను స్పీక‌ర్‌పై ఒత్తిడి తెచ్చి పెండింగ్‌లో పెట్టించిన అధికార పార్టీ నేత‌లు హైకోర్టు ఆదేశాల‌తో ఢీలా ప‌డ్డారు. మ‌రికొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు కూడా అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై తీర్పు వెలువ‌రించ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

Loading...

Leave a Reply

*