ఆ క‌లెక్ట‌ర్ ప్లాన్ అదుర్స్‌.. జిల్లా మొత్తానికి దేవుడిగా మారారు…!

untitled-6

అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం అన్నారు పెద్ద‌లు. ఆక‌లేసిన‌వాడికి కోట్లిచ్చినా ఉప‌యోగం లేదు. ప‌ట్టెడ‌న్నం పెడితే అంత‌కు మించిన సేవ మ‌రోటి ఉండ‌దు. స‌రిగ్గా ఇదే ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్నారు కేర‌ళ‌లోని ఓ క‌లెక్ట‌ర్‌. తాను ఉన్న ప్రాంతంలో ఎవ‌రూ ఆక‌లితో అల‌మ‌టించ‌కూడ‌ద‌న్న‌ది ఆయ‌న కోరిక‌. దానికోసం ఆయ‌న ఒక బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కేర‌ళ‌లోని కోజికోడ్ జిల్లా క‌లెక్ర‌ర్ ప్ర‌శాంత్ నాయ‌ర్ చేప‌ట్టిన ఈ స్ఫూర్తిమంత‌మైన ప‌థ‌కం దేశంలో ఇప్పుడు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

త‌న జిల్లాలో ఎవ‌రూ ఆక‌లితో క‌డుపు మాడ్చుకోకూడ‌ద‌న్న ఒకే ఒక ల‌క్ష్యంతో “ఆప‌రేష‌న్ సులేమాన్” ప‌థ‌కాన్ని ప్ర‌శాంత్ తెర‌పైకి తెచ్చారు. దీని ద్వారా పేద‌లంద‌రికీ కొన్ని కూప‌న్ల‌ను ప్ర‌భుత్వ‌మే పంపిణీచేస్తుంది. వాటితో ఏ హోట‌ల్‌లో అయినా ద‌ర్జాగా అంద‌రిలానే భోజ‌నం చేయొచ్చు. జిల్లాలోని హోట‌ళ్ళ య‌జ‌మానులు ఈ కూప‌న్ల‌ను నెల‌కోసారి క‌లెక్ట‌ర్ ఆఫీస్‌కి పంపుతారు. వాటికి ప్ర‌భుత్వ‌మే డ‌బ్బులు చెల్లిస్తుంది. ఈ కూప‌న్లు జిల్లాలోని అన్ని హోట‌ల్స్‌లో చెల్లుబాఆటు అవుతాయి. వీటికి తోడు హోట‌ల్స్‌లో సులేమాన్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప‌థ‌కానికి సాయం చేయాల‌నుకున్న‌వారు ఆ బాక్సుల్లో త‌మ‌కు తోచినంత సొమ్ము వెయ్యొచ్చు. ఆ సొమ్మును కూడా క‌లెక్ట‌ర్ ఈ ప‌థ‌కానికి వినియోగిస్తారు. త‌ద్వారా పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టే ఈ ప‌థ‌కంలో అంద‌రికీ భాగ‌స్వామ్యం ఉంటుంది. ‘ప‌ట్టెడ‌న్నం కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూల్లో నిలబ‌డాల్సిన అవ‌స‌రం లేదు. పూట భోజ‌నం కోసం పేద‌రికాన్ని బ‌య‌ట‌ పెట్టాల్సిన దుస్థితి ఎవ్వ‌రికీ ఉండ‌కూడ‌దు. ఆక‌లితో ఉన్న‌వారికి భోజ‌నం పెట్ట‌డం అనేది సామాజిక బాధ్య‌త‌. ఆ ఉద్దేవంతోనే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాం’ అని ప్ర‌శాంత్ నాయ‌ర్ చెబుతారు. ఇప్పుడీ ఆప‌రేష‌న్ సులేమాన్ దేశంలో చాలామందికి ఆద‌ర్శంగా నిలిచింది.

Loading...

Leave a Reply

*