ప‌వ‌న్‌కు మూడొచ్చింది… జ‌గ‌న్ ఐద‌న్నారు!

jagan

రాష్ట్రంలో రాజ‌కీయం రంజుగా మారుతోంది. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష స్థానం కోసం రెండు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ జ‌న బ‌లాన్ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. వాళ్లిద్ద‌రే వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వైసీపీకి గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌మ‌స్య‌ల‌ను తీసుకుని ప్ర‌భుత్వంతో పోరాడ‌టంలో ఆ పార్టీ వెనుక‌బ‌డుతోంద‌నే చెప్పొచ్చు.

అలాగే, చ‌ట్ట‌స‌భ‌ల‌లో ప్రాతినిథ్యం లేకున్నా…. జ‌నం స‌మస్య‌ల ప‌రిష్కారంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది జ‌న‌సేన‌. జ‌న‌సేన అధినేత ప్ర‌త్యేక‌హోదాపై నిర్వ‌హించిన రెండు స‌భ‌లు రాష్ట్రంలో, కేంద్ర ప్ర‌భుత్వంలో ఎంత క‌ద‌లిక తెచ్చాయో మ‌రి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ ఊపుతోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌లోపేతం అయ్యి బ‌రిలోకి దిగుతామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అన్న‌ట్లుగానే సినిమాలు చేస్తూనే రాజ‌కీయ కార్య‌చ‌ర‌ణ‌ను అమ‌లు చేస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ ఒక‌వైపు జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ‌లు పెట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఐదు ప్రాంతాల‌లో ఈ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఇదే క్రమంలో ప‌వ‌న్ కూడా రంగంలోకి వ‌చ్చారు. ప్ర‌త్యేక హోదా సాధన పోరులో భాగంగా న‌వంబ‌ర్ తొలి వారంలో అనంత‌పురంలో స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఎవ‌రు జ‌నామోదం పొంది వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ కీల‌క‌ ప్ర‌తిప‌క్ష పార్టీగా ఎవ‌రు రంగంలో ఉంటారో తేలాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*