అవును… ఆదాని, అంబానీలకు చెప్పాం: బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

bjp

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం అత్యంత ర‌హ‌స్యంగానే ఉంచాం. అమ‌లు చేసేవారికి కూడా చివరి వ‌ర‌కూ చెప్ప‌లేదు. ఇది మోడీ బృందం మాట‌. కాదు… బీజేపీ నేత‌ల‌కు, కార్పొరేట్ వ‌ర్గాల‌కు ఈ విష‌యాన్ని ముందుగానే లీక్ చేశారు. ఇది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. ఇప్పుడు దీనిపైనే దేశ‌మంతా గ‌గ్గొలు పెడుతోంది. మోడీ త‌న‌కు ఇష్ట‌మైన వారికి ముందుగానే నోట్ల ర‌ద్దు లీక్ చేసి ఇప్పుడు జ‌నాన్ని ఇబ్బంది పెడుతున్నార‌ని విప‌క్ష పార్టీలు ధ్వ‌జ‌మెత్తుతున్నాయి. దీన్ని అదికార ప‌క్షం ఖండిస్తోంది. ఈ ఏపిసోడ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు తాజా ట్విస్ట్ ఇచ్చారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం అదాని, అంబానీల‌కు ముందుగానే చెప్పాం అంటూ అత‌డు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

రాజ‌స్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే భ‌వానీ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. విలేక‌రుల‌తో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్యాల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో బీజేపీ నేత‌ల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లైంది. నోట్ల ర‌ద్దు లీక‌వ‌లేద‌ని తాము వాదిస్తుంటే త‌మ ఎమ్మెల్యేనే ముందుగానే కొంద‌రికి చెప్పామంటూ వ్యాఖ్యానించ‌డం బీజేపీ పెద్ద‌ల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు త‌న వ్యాఖ్య‌లు దుమారం రేప‌డంతో భ‌వానీ సింగ్ వివ‌ర‌ణ ఇచ్చారు. ర‌ద్దు స‌మాచారం లీకైందంటూ తాను ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌లేద‌ని, అలా ప్ర‌చారంలో ఉన్న వీడియోలోని గొంతు త‌న‌ది కాద‌ని ఇప్ప‌డు వాదిస్తున్నారు.

Loading...

Leave a Reply

*