కేసీఆర్‌కు అమిత్ షాకులిస్తే… కాంగ్రెస్ దూసుకుపోతోంది!

amit

కేసీఆర్‌పై అమిత్ షా చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు కాంగ్రెస్‌కు లేని బ‌లాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ ఇస్తే అధికారంలోకి వ‌స్తామ‌ని క‌న్న క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది కాంగ్రెస్‌కు. పైగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వెంట వెళ్లిపోవ‌డంతో కాంగ్రెస్ త‌లెత్తుకోలేని ప‌రిస్థితి. ఇక‌, ఉన్న నేత‌లు చేస్తున్న పోరాటాల‌కూ జ‌నంలో స్పంద‌న అంతంత మాత్ర‌మే. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ మంట‌లు కొద్దిగా ఊపునిచ్చినా.. దానిపై హైకోర్టు తీర్పు ద్వారా కొంత ఆక్సిజ‌న్ ల‌భించినా… కాంగ్రెస్ మాత్రం పున‌ర్‌వైభ‌వం సాధించ‌లేక‌పోయింది. రైతు గ‌ర్జ‌న‌లు చేసినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో త‌క్ష‌ణ వ్యూహం కోసం కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు బాదుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హ‌వాను త‌ట్టుకునేందుకు ఏం చేయాలా అన్ని ఢిల్లీ పెద్ద‌లు కూడా మ‌ద‌న‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల‌కు బీజేపీ చీఫ్ అమిత్ షా అనుకోని ఆయుధాన్ని ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన 90 వేల కోట్ల రూపాయ‌ల‌తోనే కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని అమిత్ షా చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకోని అస్త్రాలు అయ్యాయి. అంతే ఢిల్లీ నుంచి పెద్ద‌లు రాష్ట్రంలో వాలిపోయారు. కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీనే నిధులిచ్చామ‌ని చెబుతుంటే ఆ నిధులు ఏమ‌య్యాయో చెప్పాల్సిన బాధ్య‌త కేసీఆర్‌కు లేదా అని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నించ‌డం మొద‌లెపెట్టారు. ముందు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తేల్చాల‌ని కేసీఆర్‌పై యుద్ధం మొద‌లెట్టారు. షా చేసిన వ్యాఖ్య‌లను ఇటు టీఆర్ ఎస్ వ‌ర్గాలు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ చీఫ్ వ్యాఖ్య‌ల‌ను అధికార పార్టీలో పేరున్న నేత ఎవ‌రూ ఖండించ‌క‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హం.

Loading...

Leave a Reply

*