జై జ‌వాన్‌… అమ‌రుల‌కు ఓ కోటి!

indian

భార‌త ఆర్మీ సాహ‌స చ‌ర్య‌ల‌తో దేశ‌మంత‌టా జాతీయ‌త పొంగిపోతోంది. పాక్ ఉగ్ర‌వాదులను మ‌న జ‌వాన్లు మ‌ట్టుబెట్ట‌డంతో దేశంలోని ప్ర‌తి సాధార‌ణ పౌరుడూ తానే యుద్ధంలో గెలిచినంత సంబ‌ర ప‌డుతున్నాడు. ఇందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం నిన్న సూర‌త్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మం. ఉరీలో ఉగ్ర‌వాదుల మార‌ణ‌హోమంలో అమరులైన జ‌వాన్ల‌కు నివాళుల‌ర్పించేందుకు సూర‌త్‌లో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దానికి స్థానికులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ముందుగా వారంతా అక్క‌డ ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల చిత్ర‌ప‌టాల‌కు పూలు చ‌ల్లి నివాళుల‌ర్పించారు.

ఆ త‌ర్వాత కొంద‌రు క‌ళాకారులు జ‌వాన్ల సాహ‌సాన్ని క‌ళ్లకు క‌డుతూ పాట‌లు పాడారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డున్న జ‌న‌మంతా ఉప్పొంగిపోయారు. త‌మ జేబుల్లో ఉన్న డ‌బ్బంతా తీసి ఆ క‌ళాకారుల‌పైకి విస‌ర‌డం మొద‌లుపెట్టారు. ముందు చిన్న‌గా మొద‌లైన ఆ నోట్ల వాన ఆ త‌ర్వాత జ‌డి వాన‌గా మారింది. కొద్ది స‌మ‌యంలోనే ఆ వేదికంతా నోట్ల‌తో నిండిపోయింది. చివ‌ర‌కు ఆ సొమ్మునంతా తీసి లెక్కిస్తే కోటీ రూప‌యలుగా తేలింది. అందులో పాల్గొన్న క‌ళాకారులు, నిర్వాహ‌కులు ఆ సొమ్మును తాము తీసుకునేందుకు నిరాక‌రించి… వాటిని అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల‌కు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించి త‌మ దేశ‌భ‌క్తిని చాటుకున్నారు.

Loading...

Leave a Reply

*