ఏపీలో ప‌వ‌నే ప్రతిప‌క్ష నేత‌

untitled-18

రేపో మాపో నేనే సీఎం అంటూ క‌ల‌లు గంటున్న జ‌గ‌న్‌కు చంద్రబాబు ఎర్త్ పెడుతున్నట్లే ఉంది. ఉన్న ప్రతిప‌క్ష నేత ప‌ద‌విని కూడా ఆయ‌న‌కు కాకుండా చేస్తున్నట్లే ఉంది. ప‌వ‌న్‌ను రంగంలోకి తెస్తూ… జ‌గ‌న్‌ను ప‌క్కన‌పెడుతున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్న చంద్రబాబు… జ‌గ‌న్ స‌హా రాష్ట్రంలో విప‌క్ష పార్టీలు ఏ పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ నోరు తెరిచి ఇదీ ప్రజ‌ల త‌ర‌ఫున నా డిమాండ్ అని చెబితే చాలు క్షణాల్లో ఆ సమ‌స్యను ప‌రిష్కారం చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ బీమ‌వ‌రంలో మెగా ఫుడ్ పార్క్ పోరాటం. గ‌త కొన్ని నెల‌లుగా అక్కడి 30 గ్రామాల ప్రజ‌లు ఆ ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వామ‌ప‌క్ష పార్టీలు ముఖ్యంగా సీపీఎం ఆ పోరాటాన్ని ముందుండి న‌డుపుతోంది.

ఆ క్రమంలోనే సీపీఎం నేత మ‌ధుని పోలీసులు అరెస్టు చేసి కేసులు కూడా పెట్టారు. అక్కడి ప్రజ‌లంద‌రిపైనా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే ఆక్కడి స్థానికులు హైద‌రాబాద్ వెళ్లి ప‌వ‌న్‌ను శ‌ర‌ణు వేడారు. దాంతో స్పందించిన ప‌వ‌న్ హైద‌రాబాద్‌లోనే ఓ మీటింగ్ పెట్టి త‌క్షణం ఫుడ్ పార్కుపై పున‌రాలోచ‌న చేయ‌కుంటే తాను ఉద్యమం చేప‌డ‌తాన‌ని హెచ్చరించారు. అంతే దెబ్బకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆగ‌మేఘాల మీద స‌మీక్ష నిర్వహించి ఒక క‌మిటీని వేశారు. కొన్ని నెల‌లుగా వివిధ పార్టీలు, ప్రజ‌లు చేస్తున్న పోరాటాన్ని ప‌ట్టించుకోని చంద్రబాబు.. ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన ఒక్క మాట‌తోనే క‌దిలిపోయారు. దీన్ని ప‌రిశీలించిన రాజ‌కీయ‌వేత్తలు ప‌వ‌న్ చెబితేనే స్పందించ‌డం ద్వారా చంద్రబాబు ఉద్దేశ‌పూర్వకంగానే జ‌గ‌న్‌ను ప‌క్కన‌పెట్టాల‌ని చూస్తున్నార‌ని పేర్కొంటున్నారు. అంటే… ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ప్రజ‌ల‌కు వెంట‌నే ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ కాకుండా ప‌వ‌నే గుర్తుకు వ‌చ్చేలా బాబు ప్లాన్ చేస్తున్నార‌ని అనుకోవచ్చన్నది వారి ఉద్దేశం.

Loading...

Leave a Reply

*