మనవూరి రామాయణం రివ్యూ ….రేటింగ్…

untitled-171-1

రివ్యూ : మనవూరి రామాయణం

తారాగణం : ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు, దొడ్డన్న తదితరులు..

సినిమాటోగ్రఫీ : ముఖేష్

ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

కథ : జాయ్ మాథ్యూస్

సంగీతం : ఇళయరాజా

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రకాష్ రాజ్

విడుదల తేది : 07.10.16

ప్రకాష్ రాజ్ దర్శకుడుగా మారుతున్నాడు అనగానే చాలామంది ఫీలయ్యారు. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు.. అవసరమా ఇదంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం తన అభిరుచి మాత్రమే అని చెప్పి ఆ మధ్య పెద్దగా రుచి లేని ఉలవచారు బిర్యానీ తినిపించాడు. ఇక ఇప్పుడు మరో కాన్సెప్ట్ బేస్ట్ మూవీతో మనవూరి రామాయణం చెబుతానంటూ వచ్చాడు. మరి ఈ రామాయణంలో ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడో చూద్దాం..

కథ :

డబ్బుందన్న ఒకే ఒక్క కారణంతో ఊళ్లో అందరిచేతా గౌరవించబడుతుంటాడు భుజంగయ్య(ప్రకాష్ రాజ్). ఆ కారణంగానే ఆ ఊరి రామాలయ ధర్మకర్తగానూ ఉంటాడు. ప్రతి యేడాది శ్రీరామనవమి రోజున మిత్రులతో కలిసి నాటకం వేస్తుంటాడు భుజంగయ్య. అందులో ఆయన ఖచ్చితంగా రావణుడి పాత్ర మాత్రమే చేస్తుంటాడు. మరోవైపు ఊరంతా తనని గౌరవిస్తున్నా. ఇంట్లో మాత్రం తను ఆశించిన మర్యాద దక్కదు. అదో వెలితిగా భావిస్తుంటాడు భుజంగయ్య. ఇక దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించుకువచ్చిన భుజంగయ్య తనకు వీసా ఇప్పిస్తానన్నాడని అతను చెప్పిన ప్రతి పనీ చేస్తుంటాడు ఆటోడ్రైవర్ శివ( సత్యదేవ్).

ఆ క్రమంలో ఓ రోజు బాగా మందు తాగిన భుజంగయ్య శివ ఆటోలో వెళుతూ దార్లో ఒక వేశ్య( ప్రియమణి)ను చూసి మోజుపడతాడు. ఆమెతో మాట్లాడి.. భుజంగయ్య ఇంటిముందున్న పాత ఇంట్లోనే సెటప్ చేస్తాడు శివ. అయితే ఎవరైనా చూస్తారనీ.. ఆ ఇంటికి తాళం వేసి గంట తర్వాత వస్తానని వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కుతాడు. మరి అతను రాక తలుపు తెరుచుకోక.. వేశ్యతో కలిసి ఆ గదిలో బందీ అయిన భుజంగయ్య పరిస్థితి ఏంటనేది మిగతా కథ.

విశ్లేషణ :
మనవూరి రామాయణం సింగిల్ పాయింట్ కథ. దాన్ని చెప్పడానికి ఓ అరగంట షార్ట్ ఫిలిమ్ అయినా సరిపోతుంది. కానీ ఓ రేంజ్ లో సాగదీసి పదినిమిషాలు తక్కువ రెండు గంగల వరకూ లాగేసరికి రావాల్సినంత బోర్ వచ్చేస్తుంది. పైగా ఎంచుకున్న పాయింట్, టైటిల్ కు సరిపోయే సీన్స్ అస్సలు లేకపోవడం పెద్ద మైనస్. తన నటతృష్ణను తీర్చుకోవడానికి ప్రకాష్ రాజ్ చేసుకున్న ట్రైలర్ లా కనిపిస్తుందే తప్ప.. ఏ దశలోనూ ఆడియన్ ను పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయిందీ రామాయణం. రామాయణం అనగానే అందులోని చాలా పాత్రలు ఇందులో కనిపిస్తాయనుకుంటాం. కానీ అవేవీ ఉండవు. భుజంగయ్య పాత్రలో రావణుడు కనిపించే సీన్ ఒకే ఒక్కటి ఉండటం పెద్ద మైనస్. అదే సినిమాకు కీ పాయింట్ కావడం ఇంకా మైనస్ అయింది.

ఆ ఊర్లో షూటింగ్ లో ఉన్న హీరోకు కథ చెప్పడానికి వచ్చిన దర్శకుడు తన స్క్రిప్ట్ బ్యాగ్ ను శివ ఆటోలో మర్చిపోవడం.. తర్వాత ఆ ఇద్దరికీ మధ్య ఒకరకమైన కలివిడితనం పెరగడం.. సీన్స్ పరంగా బానే అనిపించినా.. కథానుగుణంగా సాగదీతగా కనిపిస్తాయి. ఇక పోలీస్ స్టేషన్ సీన్స్ కూడా అసంబద్ధంగానే కనిపిస్తాయి. భుజంగయ్య కూతురు ధర్నా చేసి అరెస్ట్ అయిన సీన్ అయినా.. ఓ గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచడం వరకూ.. బోర్ కొట్టించాయే తప్ప..కథకు ఉపయోగపడలేదు. ఇక ఇటు వేశ్యను తన ఇంటిముందు ఉన్న పాత ఇంట్లోనే ఉంచిన భుజంగయ్య అంతలా ఎందుకు వణికిపోతాడో తెలియదు. ఇక ‘‘ఆకలవుతుందంటూ’’ వేశ్య పాత్రతో చెప్పించడం ఆ పాత్ర ఔచిత్యాన్ని ఎన్నోరెట్లు పెంచింది. అలాగే ఆ వృత్తిలోని వారి మానసిక బాధకూ అద్దంపట్టింది.

వేశ్యతో ఉన్న గదిలో దాదాపు 20గంటలున్న భుజంగయ్యకు కనువిప్పు కలగడం అనేది ఎవరైనా ఊహించేదే. కాకపోతే ఈ తతంగాన్నంతా గ్రిప్పింగ్ చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.. చదువుకుంటానన్న కూతురుకే దొరికిపోయి.. తర్వాత ఆమెను చదివిస్తాననడం.. ‘‘తన గురించి ఎవరికీ చెప్పలేదు కాబట్టి కృతజ్ఞతగా’’ చదివిస్తానని చెప్పినట్టు ఉంది కానీ.. కూతురు ఇష్టాన్ని గౌరవించినట్టుగా కనిపించదు. ఇలా సినిమా షూటింగ్ కు సంబంధించిన విషయంలో ఇండస్ట్రీలో కొందరు హీరోలు, దర్శకుల మెంటాలిటీపైనా సెటైర్స్ వేసిన ప్రకాష్ రాజ్ దాని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో కొందరికి మాత్రమే అర్థమౌతుందేమో. మొత్తంగా రావణుడి మనస్తత్వం ఉన్న వ్యక్తి మారుమనస్సు పొందడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన మనవూరి రామాయణం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

ఆర్టిస్టుల పరంగా చెబితే ఆశ్చర్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కంటే మిగతా ఆర్టిస్టులే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ జ్యోతిలక్ష్మిలో నటించిన సత్యదేవ్.. ఆటోడ్రైవర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆంజనేయుడి ముందు గోడు వెల్లబోసుకునే చోట ‘జీవించాడు’. ఇక ఇప్పటి వరకూ లౌడ్ కామెడీ అదరగొట్టిన పృథ్వీ ఒకప్పుడు వెలిగి ప్రస్తుతం బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడి పాత్రలో అద్భుతమైన నటన చూపించాడు. రఘుబాబుది రొటీన్ క్యారెక్టర్. కన్నడ ఆర్టిస్ట్ దొడ్డన్న కూడా ఒకప్పటి నిర్మాతగా ఆకట్టుకున్నాడు. ఇక వేశ్య పాత్రలో ప్రయమణి వాల్యూబుల్ పర్ఫార్మెన్స్ చూపించింది.. ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపించిన అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ ఎంతో నేచురల్ గా ఉన్నాయి. ఇక ప్రకాష్ రాజ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అయినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదంటే ఆశ్చర్యమేం లేదు.

సాంకేతికంగానూ గొప్పగా కనిపించలేదీ రామాయణం. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం నిరాశపరుస్తుంది. నేపథ్య సంగీతం మరీ పేలవంగా ఉంది. పాటల్లేకపోవడం రిలీఫ్ అయినా.. ఉన్న ఒక్క టైటిల్ సాంగ్ కూడా ఎండ్ టైటిల్స్ లో వినిపిస్తుంది.. అరగంట సినిమాను రెండు గంటలపాటు ఉంచారంటే అది ప్రకాష్ రాజ్ అభిరుచే తప్ప ఎడిటర్ మిస్టేక్ అని చెప్పలేం. ముఖేష్ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమా అంతా ఒకే ఊరిలో మహా అయితే రెండు మూడు లొకేషన్స్ లోనే సాగుతున్నా.. బోర్ రాకుండా చూశాడు. మాటలు యావరేజ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదు.

పంచ్ లైన్ : మనవూర్లో ఇలాంటి రామాయణాలు ఆడవు

రేటింగ్ : 1/5

Loading...

Leave a Reply

*