ధర్మయోగి రివ్యూ & రేటింగ్..

untitled-1

సినిమా – ధర్మయోగి
నటీనటులు – ధనుష్ (డ్యూయర్ రోల్), త్రిష, అనుపమ పరమేశ్వరన్, శరణ్య, కాళి, తదితరులు…
దర్శకుడు – దురై సెంథిల్ కుమార్
సంగీతం – సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ – వెంకటేశ్
విడుదల తేదీ – అక్టోబర్ 29, 2016

దీపావళి కానుకగా కాష్మోరాతో పాటు విడుదలకావాల్సిన ధనుష్ సినిమా ధర్మయోగి… సాంకేతిక కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్స్ కు, ఎమోషనల్ సన్నివేశాలకు ధనుష్ సినిమాల్లో లోటు ఉండదు. మరి అలాంటి ఎలిమెంట్స్ కు పొలిటికల్ టచ్ కూడా యాడ్ అయితే ఎలా ఉంటుందో చూపించింది ధర్మయోగి సినిమా. తెలుగులో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ –
కోడి, అన్బు కవలలు. కోడి (ధనుష్) ఓ రాజకీయ పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూ తన తండ్రిలా పూర్తిగా అదే పనిలో తిరుగుతుంటాడు. ఇక అన్బు (ధనుష్) మాత్రం తల్లిచాటు బిడ్డ. ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఇంట్రెస్టింగ్ గా అపోజిషన్ పార్టీకి చెందిన రుద్ర (త్రిష)తో ప్రేమలో పడతాడు కోడి. తమ ప్రేమ వ్యవహారాన్ని, రాజకీయాల్ని వేటికవే వేరుగా చూస్తూ వస్తుంటారు ఈ ఇద్దరు ప్రేమికులు. అయితే ఒక దశలో మాత్రం అది సాధ్యంకాదు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… తమ నియోజకవర్గంలో ఉపఎన్నికలు రావడం… ఆ ఉపఎన్నికల్లో కోడి, రుద్ర ఇద్దరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక కావడం చకచకా జరిగిపోతాయి. రాజకీయంగా శత్రువులుగా మారిన ఈ ఇద్దరు ప్రేమికులు, వ్యక్తిగతంగా కూడా శత్రువులుగా మారిపోతారు. పరిస్థితులు ఎంతలా దిగజారిపోతాయంటే ఒక దశలో అధికార పీఠం కోసం రుద్ర… కోడిని హత్య చేస్తుంది. అయితే రాజకీయంగా సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో, తనకు ఇష్టంలేకపోయినా… అధికారాన్ని చనిపోయిన కోడి తమ్ముడు అన్బుకు త్యాగం చేస్తుంది రుద్ర. సరిగ్గా ఇక్కడ్నుంచే ట్విస్ట్ మొదలౌతుంది. అప్పటివరకు అమాయకంగా కనిపించిన అన్బు..ఒక్కసారిగా సిసలైన రాజకీయ నాయకుడిగా మారిపోతాడు. పనిలోపనిగా తన కవల సోదరుడ్ని చంపిన వ్యక్తులు ఎవరనే విషయంపై సొంతంగా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు. దీంతో కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి త్రిష ఏమైంది.. అన్బు తను అనుకున్నది సాధించాడా.. అనేది క్లయిమాక్స్ లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు –
ఈ సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది త్రిష గురించే.దాదాపు పుష్కరకాలంగా పరిశ్రమలో కొనసాగుతున్న త్రిష.. ఈమధ్య కాలంలో మేకోవర్ పాత్రల కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని పిచ్చిపిచ్చి ప్రయోగాలు కూడా చేసి చేతులు కాల్చుకుంది. ఇన్నాళ్లకు ఆమెకు ఏం కావాలో, ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో ధర్మయోగి సినిమాతో అర్థమై ఉంటుంది. నిజంగా ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో త్రిష చించేసింది. ఆమె పర్ ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. త్రిషను సాఫ్ట్ గా ఊహించుకొని థియేటర్లకు వెళ్లే ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ కచ్చితంగా సినిమా చూసి షాక్ అవుతారు. ఇక ధనుష్ ఎప్పట్లానే తన మేజికల్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే సత్తా తనలో ఉందని మరోసారి రుజువుచేసుకున్నాడు. రెండు డిఫరెంట్ పాత్రలు పోషించడంలో ఎక్కడా తడబడలేదు. త్రిష, ధనుష్ ఇద్దరూ అవార్డ్ విన్నింగ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమాకు అవార్డులు గ్యారెంటీ. హోమ్లీ గర్ల్ గా అనుపమ పరమేశ్వరన్, ధనుష్ తల్లిగా శరణ్య పొన్నవనమ్, ఫ్రెండ్ పాత్రలో కాళి… తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్ల పనితీరు –
చాలా రోజులు తర్వాత త్రిష, ధనుష్… అవార్డు విన్నింగ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారంటే ఆ క్రెడిట్ కచ్చితంగా దర్శకుడు దురై సెంథిల్ కుమార్ కే దక్కుతుంది. ఓ కథగా చూసుకుంటే థర్మయోగిలో ఏం లేదు. కానీ తన మేజికల్ స్క్రీన్ ప్లేతో, ఆకట్టుకునే సన్నివేశాలతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు సెంథిల్. సినిమాలో చాలా సీన్లలో త్రిష మాట్లాడదు. అలా మౌనంగా చూస్తుంటుంది. కానీ సన్నివేశాల కారణంగా… ఆ సైలెన్స్ నుంచే ప్రేక్షకులకు ఎంతో చెప్పగలిగాడంటే అది దర్శకుడి ప్రతిభే. సెంథిల్ ను ధనుష్ ఎంతలా నమ్మాడో ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. ఇక ఈ పొలిటికల్ డ్రామాను మరింత గ్రిప్పింగ్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ వెంకటేశ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

తెలుగు పెన్ సమీక్ష –
రెగ్యులర్ కామెడీ సినిమాలు, ప్రేమకథలు చూసి బోర్ కొట్టినవాళ్లకు ధర్మయోగి సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఓ కథను ఇలా కూడా చెప్పొచ్చనడానికి ధర్మయోగి ఎగ్జాంపుల్ గా మారుతుంది. మరో ముఖ్యమైన విషయం… త్రిష ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్లు కచ్చితంగా ఈ సినిమా చూసి తీరాల్సిందే. అయితే పొలిటికల్ డ్రామా బాగున్నప్పటికీ… ఆ సాంబార్ వాసన మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కదు. డబ్బింగ్ సినిమా కావడంతో పూర్తిగా నేటివిటీ మిస్ అయింది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కావు. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. తమిళనాట 24 గంటల ముందే విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ దీపావళికి తెలుగులో పెద్దగా పోటీలేనప్పటికీ… అత్యథిక థియేటర్లలో విడుదలైన కాష్మోరాను తట్టుకొని నిలబడగలిగితే.. ధర్మయోగి సినిమా కచ్చితంగా ధనుష్ కు ఇక్కడ కలిసొస్తుంది. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయిన ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన మూవీ ఇది.

రేటింగ్ – 3/5

Loading...

Leave a Reply

*