5 సినిమాలు.. ఏ సినిమా హిట్.. ఏ మూవీ ఫ‌ట్‌..?

5

ఇది టాలీవుడ్‌కి గోల్డెన్ ఫ్రైడే. ఏకంగా నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి ఈ వీకెండ్‌న‌. సంక్రాంతి త‌ర్వాత మ‌రోసారి ఇదే రేంజ్‌లో ఇన్ని సినిమాలు విడుద‌ల కావడం తొలిసారి. ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతో టాలీవుడ్‌కి ఒక్క‌సారిగా పండ‌గ కళ వ‌చ్చింది. అందుకే, ఈ స్థాయిలో ఒక్క రోజు గ్యాప్‌లో అయిదు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. వీటిల్లో ఏ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది..? ఏ మూవీ ఫ‌ట్ అయింది..? ఓ లుక్కేద్దాం..

ప్రేమ‌మ్‌..
నాగ‌చైత‌న్య లీడ్ రోల్ పోషించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్ ఇది. మూడు ప్రేమ‌క‌థ‌ల స‌మాహార‌మే ఈ ప్రేమ‌మ్‌. స్కూల్ ఏజ్ ప్రేమ‌, టీనేజ్ ప్రేమ‌తోపాటు మెచ్యూర్డ్ ల‌వ్‌. ఇలా ఓ వ్య‌క్తిలోని మూడు ద‌శ‌ల ప్రేమ‌ను అందంగా చెప్పే ప్ర‌య‌త్న‌మే ప్రేమ‌మ్‌. మ‌ల‌యాళీ రీమేక్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. చైతు పెర్‌ఫార్మెన్స్‌కి ముగ్గురు హీరోయిన్‌లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, శృతిహాస‌న్‌, మ‌డొన్నా సెబాస్టియ‌న్ గ్లామ‌ర్ యాడ్ అయింది. ముగ్గురితోనూ మంచి కెమిస్ట్రి పండించాడు చైతు. ఇటు, ప్ర‌తి ఫ్రేమ్‌ని, సీన్‌ని అందంగా తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. ద‌స‌రా బ‌రిలో ఇదే బిగ్ మూవీ. పాజిటివ్ టాక్ రావ‌డంతో కాస్త ప్ర‌మోష‌న్స్ యాడ్ అయితే చైతు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే చాన్స్ ఉంది. ఇప్ప‌టికే, కాబోయే ఫియాన్సీ సినిమాకి మంచి టాక్ రావ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫుల్ ఖుషీగా ఉన్నారట‌. స‌మంత అప్పుడే సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయింది.

ఈడు గోల్డ్ ఎహే..
సునీల్ ద్విపాత్రాభిన‌యం పోషించిన మూవీ ఇది. ఆ మ‌ధ్య కథ‌ల ఎంపిక‌లో కాస్త ప‌ట్టు త‌ప్పిన మ‌ర్యాద‌రామ‌న్న‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ గాడిలో ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది. ప‌క్కా కామెడీ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌లు ఎంచుకుంటున్నాడు. ఈ ఏడాది జ‌క్క‌న్న‌తో యావ‌రేజ్ ద‌క్కించుకున్న సునీల్‌.. ఈడు గోల్డ్ ఎహేతో మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ సినిమా కూడా ఎబౌ యావరేజ్ రివ్యూస్‌ని సొంతం చేసుకుంది. సునీల్ కామెడీ టైమింగ్‌కి ద‌ర్శ‌కుడు వీరు పోట్ల క‌థ‌, క‌థ‌నంతోపాటు డైలాగులు కూడా తోడు కావ‌డంతో ఈడు గోల్డ్ ఎహె.. ఓకే ఎహె అనిపించుకుంది. బీ,సీ సెంట‌ర్‌ల‌లో ఈడు గోల్డ్ ఎహేకి క‌లెక్ష‌న్లు బాగానే వ‌చ్చే చాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మ‌రి, ఎలా నిలుస్తుందో చూడాలి.

అభినేత్రి..
త‌మ‌న్న న‌టించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ప్ర‌భుదేవా హీరో. టైటిల్ రోల్ మిల్కీబ్యూటీది. హార‌ర్ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం సో సో అనే టాక్‌ని సొంతం చేసుకుంది. ద‌ర్శ‌కుడు విజ‌య్ అభినేత్రిని గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించాడు. హార‌ర్ కామెడీకి కావ‌ల్సిన మ‌సాలాలన్నీ ద‌ట్టించాడు. ఇప్ప‌టికే ఈ జాన‌ర్‌లో అనేక సినిమాలు రావ‌డంతో క‌థ‌లో కొత్త‌ద‌నం మిస్ అయింద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ప్ర‌భుదేవా, త‌మ‌న్న డ్యాన్స్‌లు అమీ జాక్స‌న్ అందాలతో స‌రిపెట్టుకోవ‌చ్చ‌ట‌.

మ‌న ఊరి రామాయ‌ణం..
సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టించి, నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఇది. ఈ సినిమా కేవ‌లం నాలుగు పాత్ర‌ల‌తోనే తెర‌కెక్కింది. క‌థ‌, క‌థ‌నం బావున్నాయి. ప్ర‌కాష్ రాజ్ డైరెక్ష‌న్ ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అభిరుచిగ‌ల నిర్మాత‌గానూ స‌క్సెస్ అయ్యాడు. అయితే, స‌గం సినిమా చిన్న రూమ్‌లోనే న‌డ‌వ‌డంతో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రియ‌మ‌ణి న‌ట‌న మాత్రం సినిమాకి హైలైట్ అట‌. డైరెక్ట‌ర్‌గా ప్ర‌కాష్ రాజ్ గ‌త చిత్రాలకంటే ఇది భిన్నంగా ఉంద‌ట‌.

జాగ్వార్‌..
మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గౌడ్ త‌న‌యుడు నిఖిల్ తెరంగేట్రం చేసిన మూవీ జాగ్వార్‌. తొలి మూవీయే అయినా భారీగా ఖ‌ర్చుపెట్టారు. ఇంట్ర‌డ‌క్షన్ హీరో కోసం భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌గా తీర్చిదిద్దారు. సినిమా క‌థ‌, క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌.. ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్‌ని గుర్తు చెయ్య‌డంతో జాగ్వార్‌కి తొలి రోజే బిలో యావ‌రేజ్ టాక్‌ని పొందింది. అయితే, క‌లెక్ష‌న్లు మాత్రం బావున్నాయి.

మొత్త‌మ్మీద‌, అయిదు సినిమాలు ఒక్కొక్క‌టి ఒక్కో జాన‌ర్‌లో రావ‌డం క‌లిసొచ్చింది. క‌థ, క‌థ‌నం ప‌రంగా వేటిక‌వే విభిన్నం. అయితే, ఈ సినిమాల‌న్నింటిలో ప్రేమ‌మ్‌కే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. ఆ త‌ర‌వాత సునీల్ ఈడు గోల్డ్ ఎహే రేస్‌లో ఉంది. మ‌రి, మిగిలిన 3 చిత్రాల‌లో స‌ర్‌ప్రైజ్ స‌క్సెస్‌ని సొంతం చేసుకునే మూవీ ఏద‌యినా ఉంటుందేమో చూడాలి.

Loading...

Leave a Reply

*