నిజ‌మా.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటారా..?

big-notes

పెద్ద నోట్ల ర‌ద్దు అంశం రోజు రోజుకీ కొత్త మ‌లుపు తీసుకుంటోంది. మొద‌టి రోజు మోదీ దీనిపై ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే హ‌ర్షాతిరేకాలు మిన్నంటాయి. బ్లాక్ వీరుల‌పై ఆయ‌న బాహుబ‌లిలా రెచ్చిపోతున్నాడ‌ని ప్రశంస‌లు కురిశాయి. అవినీతి రాయుళ్లు ఇక త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు మోదీ కొత్త దిశానిర్దేశం చేస్తున్నాడ‌ని చెప్పుకొచ్చారు. కానీ, మూడో రోజు నుంచే సీన్ మారింది. రోడ్ల‌పై సామాన్యులు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. క్యూ లైన్‌ల‌లో డ‌బ్బులు కోసం నిల‌బ‌డి ఇప్ప‌టిదాకా దేశ వ్యాప్తంగా 40 మందిదాకా చ‌నిపోయార‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. పాక్ ఉగ్ర‌వాదులు చేసిన ఉరీ దాడిలో కూడా ఇంత‌మంది చ‌నిపోలేద‌ని, మోదీ.. ఆర్ధికంగా చేసిన సర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌లో 40 కుటుంబాలు దిక్కులేకుండా అయిపోయాయ‌ని విప‌క్షాలు దాడి చేస్తున్నాయి. ఇటు ఎన్నో ల‌క్ష‌ల మంది రోజు క్యూ లైన్‌ల‌లో ఏటీఎమ్‌ల ద‌గ్గ‌ర‌, బ్యాంక్‌ల ద‌గ్గ‌ర నిల‌బ‌డుతుంటే.. వారిలో అస‌హ‌నం పెరిగిపోతోంది.

రాబోయే రోజుల్లో జ‌రిగే మంచేమో కానీ, ప్రస్తుతం ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న న‌ష్టం మాత్రం తీవ్రంగా ఉంద‌నే వ్యాఖ్య‌ల రోజురోజుకీ తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇటు, ప్ర‌తిప‌క్షాలు కూడా దూకుడు పెంచుతున్నాయి. మ‌రోవైపు, పార్ల‌మెంట్ సాక్షిగా మోదీని, బీజేపీని ఇరుకున పెట్టాల‌ని విప‌క్షాల‌న్నీ న‌డుం బిగించాయి. ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, సీపీఎం నేత సీతారం ఏచూరి ఆందోళ‌న‌ల‌ను ఉద్ధృతం చేస్తున్నారు. మోదీ నిర్ణ‌యంపై విరుచుకుపడుతున్నారు. ఇక‌, మూడు రోజుల్లో ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే.. దేశ వ్యాప్తంగా త‌మ ఆందోళ‌న‌లు చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు పంపుతున్నారు. దీంతో, పాత నోట్ల ర‌ద్దుపై మోదీ త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న చెయ్యాల‌ని ఈ నేతలంతా దేశ వ్యాప్త ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నారు.

ఎంత‌మంది నేత‌లు వ‌చ్చినా, ఎన్ని పోరాటాలు చేసినా మోదీ మాత్రం వెన‌క్కి త‌గ్గే చాన్స్ లేదంటున్నార‌ట‌. ఎందుకంటే, దేశంలోని ఇత‌ర రాష్ట్రాల సీఎంల నుంచి ఒత్తిడి రావ‌డం లేదు. ఇటు, ఒడిషా ముఖ్య‌మంత్రి నవీన్ ప‌ట్నాయ‌క్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా నోట్ల ర‌ద్దు అంశాన్ని స‌మ‌ర్ధిస్తున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు ప్ర‌జాందోళ‌న దిశ‌గా అడుగు వెయ్య‌లేదు. ఆయ‌న ఆచితూచి స్పందించాలని గులాబీ నేత‌ల‌కు సూచిస్తున్నారు. దీంతో, త‌న నిర్ణయానికి కొంత‌మంది ముఖ్య‌మంత్రుల మ‌ద్దతు కూడా ఉండ‌డం మోదీకి కాస్త పాజిటివ్‌గా మారింది. అందుకే, విప‌క్షాలు ఎంత‌గా బెదిరించినా నోట్ల ర‌ద్దుపై వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ఆర్ధిక మంత్రి జైట్లీ ఇవాళ ప్ర‌క‌టించారు.

నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట పడటంతో పాటు ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గుముఖం పట్టాయనే నివేదికలతో నోట్ల రద్దు నిర్ణయం మేలే చేసిందని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని మోదీ సర్కారు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మరి ప్రతిపక్షాల ఆందోళనకు కేంద్రం తలొగ్గుతుందా? మమత, కేజ్రీవాల్ ఇచ్చిన మూడ్రోజుల గడువులోగానే మోదీ సర్కారు వెనక్కు తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

Loading...

Leave a Reply

*