పెళ్లికొస్తే కొత్త నోట్లు… సెల‌బ్రిటీల‌కు గాలి బంప‌ర్ ఆఫ‌ర్‌!

gali

మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ఇప్పుడు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ముందుకు తెచ్చారు. త‌న కుమార్తె పెళ్లిని ఘ‌నంగా చేయాల‌నుకున్న గాలి దానికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీడియో సాంగ్‌తో రూపొందించి ఆయ‌న పంచిన పెళ్లి కార్డు ఒక్కొక్క‌టి ఎనిమిది వేల రూపాయ‌లు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అలాగే, ప‌ద‌కొండు రోజుల పెళ్లి చేయబోతున్న గాలి… దానికి బాలీవుడ్‌… టాలీవుడ్ నుంచి సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించారు. వారితో వినోద కార్య‌క్ర‌మాలు పెట్టించారు. అయితే, గ‌త మంగ‌ళ‌వార మోడీ పిడుగులాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కోట్లాది రూపాయ‌లు వెచ్చించి చేయ‌బోతున్న గాలి ఇంటిలో పెళ్లిపై ఆ ప్ర‌భావం ప‌డుతుందేమోన‌ని అంద‌రూ అనుమానించారు.

అయితే, అనూహ్యంగా గాలి ఇప్పుడిస్తున్న ఆఫ‌ర్‌తో అందరూ అవాక్క‌వుతున్నారు. త‌న కుమార్తె పెళ్లిలో ఎంట‌ర్‌టైన్ చేసేందుకు వ‌స్తే… న‌జ‌రానాలు కొత్త నోట్ల రూపంలో ఇస్తాన‌ని ఈ మైనింగ్ మాఫియా అధినేత బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించార‌ట‌. అస‌లే వంద నోటు కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న కాలం ఇది. చిన్నోడి నుంచి పెద్దొడి వ‌ర‌కూ అంద‌రూ చేతిలో పెద్ద నోటు ప‌ట్టుకుని చిల్ల‌ర కోసం గ‌ల్లీ గ‌ల్లీ తిరుగుతున్న రోజుల‌లో గాలి నుంచి ఇలాంటి ఆఫ‌ర్ రావ‌డంతో సెల‌బ్రిటీలంతా ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నార‌ట‌. ఎలా సంపాదించాడో… ఎక్క‌డ నుంచి తెచ్చాడో కానీ గాలి ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో కొత్త నోట్లు పోగేసాడ‌ని స‌మాచారం. కుమార్తె పెళ్లికి ఏ లోటు రాకుండా చూసుకునేందుకు త‌న మంత్రాగాన్నంతా ఉప‌యోగించి పాత నోట్లు మార్చి కొత్త నోట్ల‌ను గాలి సేక‌రించాడ‌ని చెబుతున్నారు.

అస‌లే బీజేపీలో కీలకంగా ప‌ని చేసిన నేత కావ‌డంతో ఆ పాత ప‌రిచ‌యాలు ఏవైనా ఆయ‌న‌కు ఈ విష‌యంలో ఉప‌యోగ‌ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని… దాన్ని ఉప‌యోగించుకునే భారీగా పాత నోట్లు మార్చేసుకున్న జ‌నార్ద‌న్ రెడ్డి ఇప్పుడు ఆ కొత్త నోట్లు ఎర‌గా వేసి సెల‌బ్రిటీల‌ను త‌న పెళ్లి మండ‌పం బాట ప‌ట్టిస్తున్నారని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

Loading...

Leave a Reply

*